“తెలంగాణలో భూముల క్రయవిక్రయాలు సాదా బైనామాల మీద (తెల్లకాగితంపై) జరుగుతున్నాయి. డబ్బులు లేకనో, అవగాహన లేకనో పట్టా చేయించుకోవడం లేదు. 20-30 ఏళ్లు కాగితాల మీదే వున్న భూములు రిజిస్ట్రేషన్ కోసం వస్తే అనవసర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికి పరిష్కారం కావాలి. జూన్ 2 నుండి 10వ తేది వరకు సాదా బైనామాలపైన జరిగిన లావాదేవీల ప్రకారం భూములన్నింటినీ రిజిష్టర్ చేయాలి. 2014 జూన్ 2 నాటికి సాదా బైనామాల మీద వున్న ఐదు ఎకరాల లోపు భూమిని ఉచితంగా రిజిష్టర్ చేసి, పేరు మార్పిడి చేయాలి. ఎనిమిది రోజుల పాటు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, వివరాలన్నింటినీ కంప్యూటర్లో అప్ డేట్ చేయాలి” అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
“వారసత్వంగా సంక్రమించిన భూములకు సంబంధించి మ్యుటేషన్ (పేరు మార్పడి) చేయడానికి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వనిదే పని జరగడం లేదు. వారసత్వ హక్కుల ప్రకారం పేరు మార్పిడి (పౌతి) చేసే విషయంలో కూడా 10 రోజుల వ్యవధి పెట్టుకోవాలి. దరఖాస్తు వచ్చిన పది రోజుల్లోగా పేరు మార్పిడి చేసి, 11వ రోజు కలెక్టరేట్ కు వివరాలు పంపాలి. దరఖాస్తు చేసినప్పుడే ఏదైనా అభ్యంతరముంటే చెప్పాలి. తెలవనోళ్లకు, నిరక్షరాస్యులకు అవగాహన కల్పించాలి. మ్యుటేషన్ ప్రక్రియ అవినీతిరహితంగా జరగాలి” అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. ‘ఎలాంటి ప్రాంతంలోనైనా సరే, భూమి విక్రయం జరిగి రిజిస్ట్రేషన్ అయిన 15 రోజుల్లో పేరు మార్పిడి జరగాలి. 16వ రోజు వివరాలు కలెక్టరేట్ కి అప్ లోడ్ చేయాలి. ఈ వ్యవహారాలు చూసేందుకు కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక అధికారిని నియమించాలి’ అని సిఎం చెప్పారు. కనీసం మూడు ఎకరాల వ్యవసాయ భూమి వుంటే ఆర్థిక వనరుగా ఉపయోగ పడుతుంది. కానీ గతంలో వ్యవసాయానికి ఉపయోగపడని భూమిని, రాళ్లు రప్పలతో కూడిన భూమిని పంపిణీ చేశారు. ఫలితంగా లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనైనా పరిస్థితి మారాలి. అసైన్డ్ భూముల వివరాలు సేకరించాలి. అసైన్డ్ దారుల వద్దే భూమి వుందా? ఆ భూమిలో వ్యవసాయం చేస్తున్నారా? అసలు ఆ భూమి ఎక్కడుంది? అనే వివరాలు జూన్ 30 లోగా వివరాలు సేకరించాలి. అసైన్డ్ భూముల వివరాలు అందుబాటులోకి వస్తే ప్రభుత్వం మరికొన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఇతరుల చేతుల్లోకి వెళ్లిన భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు కేటాయిస్తాం. అసైన్డ్ దారులు కాస్తులో వుంటే వారు వ్యవసాయం చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, బిసి కార్పోరేషన్ల ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తాం” అని సిఎం వివరించారు. సాదా బైనామాలను రిజిస్ట్రేషన్ చేయించే విషయంలో వారసత్వ హక్కుగా పేరు మార్పిడి విషయంలో, రిజిస్ట్రేషన్ తర్వాత పేరు మార్పిడి సందర్భాల్లో దరఖాస్తు వచ్చిన నాటి నుంచి పని పూర్తి అయ్యే వరకు అన్ని వివరాలు కంప్యూటరీకరించాలని చెప్పారు.
‘జూన్ 2 నుంచి 10 వరకు సాదా బైనామాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం హెచ్ఎండిఎ, కుడా, ఇతర మున్సిపల్ ప్రాంతాలు మినహా గ్రామీణ ప్రాంతల్లో జరగాలి. భూముల వ్యవహారంలో అవినీతికి, నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు బదలాయించే సందర్భంలో వసూలు చేసే (నాలా) పన్నును ఇటీవలే సవరించాం. దాని ప్రకారం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి అనుమతులు ఇవ్వాలి. మీ సేవా కేంద్రాల్లోనే పన్ను కట్టి, దరఖాస్తు చేసుకుంటే చాలు, ఈ మార్పిడి జరగాలి. 15 రోజుల్లో మార్పిడి చేయాలి’ అని సిఎం చెప్పారు.
‘వాతావరణం కొంత చల్లబడినా ఎండా కాలం అయిపోలేదు. ప్రజలకు మంచినీరు సరఫరా చేయడంతో పాటు ఇతర అన్ని కార్యక్రమాలను కొనసాగించాలి. వచ్చే ఖరీఫ్ కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. పత్తికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులను ప్రోత్సహించాలి. సోయాబీన్ విత్తనాలను ఎక్కువ మొత్తంలో రైతులకు అందుబాటులో వుంచాలి. ఆయా ప్రాంతాల్లో రైతుల డిమాండ్ చేసే ఇతర విత్తనాలను కూడా వ్యవసాయ శాఖ ద్వారా అందించాలి. రైతులకు అవసరమైనంత డిఎపి, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో వుంచాలి. ఖరీఫ్ వస్తున్నందున ఈ లోపున మిషన్ భగీరథ పైపులైన్ల నిర్మాణం వ్యవసాయ క్షేత్రాల్లో పూర్తి చేయాలి’ అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
“జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరపాలి. ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ పతాకావిష్కరణ చేయాలి. అన్ని కార్యాలయాలు విద్యుత్ దీపాలతో అలంకరించాలి. ప్రజలకు స్వీట్లు పంచాలి. అనాధ శరణాలయాలు, అంధ పాఠశాలల్లో, ఆసుపత్రుల్లో స్వీట్లు, పండ్లు పంపిణీచేయడంతో పాటు మాంసాహారం అందించాలి. హోటల్స్, మాల్స్ లో కూడా ఉత్సవ వాతావరణం కనిపించాలి. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గొప్పగా గౌరవించాలి. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఏయిర్ పోర్టుల్లో ఉత్సవ వాతావరణం కనిపించాలి. గుడులు, మసీదులు, చర్చ్ లలో తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, వానల కోసం ప్రత్యేక పూజలు చేయాలి. అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించాలి. నివాళి తర్వాతే ఉత్సవం నిర్వహించాలి. కవి సమ్మేళనాలు నిర్వహించాలి. ఉపాధి హామీ కూలీలకు కూడా పండ్లు, స్వీట్లు ఇవ్వాలి. ప్రతీ జిల్లాకు రూ. 30 లక్షల చొప్పున ఉత్సవాల నిర్వహణ కోసం ఖర్చు చేయడానికి నిధులు ఇస్తున్నాం. సాంస్కృతిక కార్యక్రమాలు జరపాలి. హైదరాబాద్ లో జరిగే ప్రధాన ఉత్సవానికి ప్రతి జిల్లా నుంచి 50 మంది ప్రముఖులను పంపించాలి. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ నియామక పత్రాన్ని అందించాలి. అర్హతలు సాధించడానికి ఐదేళ్ళ సమయం ఇవ్వాలి. ఈ విషయంలో అన్ని రకాల నిబంధనలు సడలిస్తాం అని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
“ప్రజా సంక్షేమం కోసం చేసే కార్యక్రమాల్లో అవినీతిని నిరోధించాలి. కళ్యాణలక్ష్మితో పాటు ఇతర కార్యక్రమాల్లో లబ్ధిదారులకు అందించే సాయాన్ని చెక్కు రూపంలో స్థానిక ఎమ్మెల్యేల ద్వారా అందించాలి” అని ముఖ్యమంత్రి సూచించారు. కళ్యాణలక్ష్మి చెక్కులను ఆడపిల్ల తల్లికి అందించాలని సూచించారు. వివాహానికి 20 రోజుల ముందే దరఖాస్తు చేయాలని, పెళ్లికి ముందే సాయం అందాలని సిఎం చెప్పారు.
“పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం అనే అంశాలను దృష్టిలో వుంచుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరపాలని నిర్ణయించాం. తెలంగాణలో పెద్ద జిల్లాలున్నాయి. చిన్న జిల్లాల వల్ల చాలా ఉపయోగాలు వున్నాయి. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో 153 అసెంబ్లీ సీట్లు వుంటాయి. రాష్ట్రంలో 24-25 జిల్లాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన వుంది. హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలను ఎలా పునర్వ్యవస్థీకరించాలనే అంశంలో అనేక విధాలుగా ఆలోచిస్తున్నాం. అనేక ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. అన్నింటిపై అధ్యయనం జరిపి నిర్ణయం తీసుకోవాల్సి వుంది. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం కలెక్టర్లు కూడా శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రతిపాదనలు పంపాలి. ఒక్కో జిల్లాలో నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాలు, సగటున 20 మండలాలు వుంటాయి. జూన్ 2 తర్వాత హైదరాబాద్ లో వర్క్ షాపు పెట్టుకుని జిల్లాల ఏర్పాటుపై తుది కసరత్తు చేసుకుందాం. మండలాలు కూడా పునర్వ్యవస్థీకరణ కావాలి. మండల కేంద్రానికి దగ్గరున్న గ్రామాలను అదే మండలంలో చేర్చాలి. అర్బన్ మండలాలు కొత్తగా ఏర్పాటు చేయాలి. రెండు నియోజకవర్గాలకు కలిపి ఒక ఆర్డిఓ వుండాలి. రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ జరపాలి. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేయాలి” అని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చెప్పారు.
సిఎస్ ఆధ్వర్యంలోని కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. కలెక్టర్లు కూడా కూలంకశంగా అధ్యయనం చేసి, ప్రతిపాదనలు తయారు చేసి. మ్యాపులు ,వర్క్ షాపు నిర్వహించిన తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుందాం. ప్రజల సౌలభ్యం మేరకే జిల్లాల ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి, కొత్త కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాల నిర్మాణానికి వంద కోట్ల చొప్పున కేటాయిస్తామని, ఈ దసరా నుంచే కొత్త జిల్లాలు మనుగడలోకి రావలని ఆదేశించారు.
అదనంగా రెవిన్యూ అధికారులను. ఖాళీలతో పాటు కొత్త పోస్టులపై ప్రతిపాదనలు , జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణతో కలెక్టర్లు శాస్త్రీయంగా ప్రతిపాదనలు పంపాలి. పదవ తరగతి పూర్తి చేసిన అనాథ విద్యార్థులకు ఏలాంటి పరిమితి లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించాలి.” అని సీఎం అన్నారు.
“రెవిన్యూ కోర్టుల్లో పెండింగులో వున్న కేసులను త్వరగా పరిష్కరించాలి. ఎక్కువ వాయిదాలు వేయకుండా త్వరగా విచారించి, పరిష్కరించాలి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం ఎక్కడికక్కడ టెండర్లు పిలవాలి. స్థానికులతో కట్టించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం ఇసుకను ఉచితంగా అందించాలి” అని సిఎం చెప్పారు.
“కృష్ణా పుష్కరాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేయాలి. గోదావరిలాగా కృష్ణానది చాలా ఎక్కువ పొడవైన తీరం లేనందున వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పుష్కర ఘాట్స్, పార్కింగ్ ప్లేస్, అప్రోచ్ రోడ్లకు ప్రాధాన్యతనివ్వాలి. నదిలో పడవలు, ఈతగాళ్లను అందుబాటులో వుంచాలి. జోగులాంబ దేవాలయం దగ్గర ఏర్పాట్లు చేయాలి” అన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి