మూస పద్దతిలో కాకుండా వినూత్నంగా ఆలోచించి, వాణిజ్య పన్నులశాఖ వ్యవస్థను, వసూళ్లను పటిష్ట పరచాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. సరిగా పన్నులు కట్టేవారికి ప్రోత్సాహకంగా, పన్నులు ఎగవేసేవారి పట్ల కఠినంగా, బాగా పనిచేసే అధికారుల వెన్నుతట్టేలా కార్యక్రమాల రూపకల్పన చేయాలని సూచించారు.
రాష్ట్రానికి అత్యధిక ఆదాయం సమకూర్చే వాణిజ్య శాఖను పటిష్టం చేసుకోవాలని, అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలని చెప్పారు. ఖాళీలన్నీ భర్తీ చేయాలని, వెంటనే పదోన్నతులు ఇవ్వాలని సూచించారు. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రావాల్సినంత ఆదాయం పూర్తిస్థాయిలో వస్తుందా? లేదా? అనే అంశాన్ని శాస్త్రీయంగా బేరీజు వేసుకోవాలని చెప్పారు. వంద శాతం పన్నులు వసూలయ్యే విధానం అమలు చేయాలని సూచించారు. చిత్తశుద్దితో విధులు నిర్వర్తించే ఉద్యోగులను ప్రోత్సహించే కార్యక్రమాలను రూపొందించాలని, పన్నులు సక్రమంగా చెల్లించే వ్యక్తులు, సంస్థలను గుర్తించి ప్రోత్సహించాలన్నారు.
రూ. 3,600 కోట్ల రూపాయల బకాయిలు కోర్టు వివాదాల్లో వున్నాయని, ఆ కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కార్పోరేషన్ల ద్వారా జరిపే కొనుగోళ్ల సందర్భంగా టిడిఎస్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. పదవి విరమణ చేసే అధికారుల సేవలను, అనుభవాలను ఉపయోగించుకోవాలని సూచించారు.ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయం ద్వారా రాష్ట్రంలో అనేక కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని, ఫలితంగా పన్నులు మరింత ఎక్కువ వచ్చే అవకాశం వుందన్నారు. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రేవతి రోహిణి, అడిషనల్ కమిషనర్ కె. చంద్రశేఖర్ రెడ్డి తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి