తెలంగాణ వ్యాప్తంగా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించాలని, ప్రభుత్వ పరంగా ఈద్గా, మసీదుల దగ్గర కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో జరిగే రంజాన్ సందర్భంగా ప్రభుత్వం తరపున చేయాల్సిన కార్యక్రమాలపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, సీనియర్ ఐపిఎస్ అధికారి ఎ.కె. ఖాన్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, సిఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఇఫ్తార్ విందు ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 26న హైదరాబాద్ లోని నిజాం కాలేజి మైదానంలో సాయంత్రం ప్రత్యేక ప్రార్థన చేసి, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలోని ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మత పెద్దలు, రాయబారులు, కాన్సులేట్లను ఆహ్వానించాలని సిఎం చెప్పారు. నిజాం కాలేజిలో జరిగే ప్రధాన కార్యక్రమంలో తాను పాల్గొంటానని సిఎం వెల్లడించారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇఫ్తార్ విందులు జరగాలన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే ప్రధాన కార్యక్రమానికి కలెక్టర్లు సమన్వయకర్తలుగా వ్యవహరించాలని సూచించారు.
రంజాన్ సందర్భంగా 2 లక్షల మంది పేద ముస్లిం కుటుంబాలకు కొత్త బట్టలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ నెల 17 నుంచి 22 వరకు హైదరాబాద్ నగరంలోని 100 ప్రాంతాల్లో, జిల్లాల్లో 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. మదర్సాలు, అనాథ శరణాలయాల్లో కూడా దుస్తులు పంపిణీ చేయాలన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింల ప్రార్థనా స్థలాల వద్ద కావాల్సిన కనీస వసతులు ఏర్పాటు చేయాలని సిఎం చెప్పారు.
పేద ముస్లింలు, మైనారిటీల విద్య, ఉపాధి కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది మైనారిటీలకు ప్రభుత్వ పరంగా భూ పంపిణీ జరిగినట్లు లెక్కలున్నాయని, అవి ఏ పరిస్థితుల్లో ఉన్నాయో విచారణ జరపమని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. వివరాలు అందిన వెంటనే సదరు భూములన్నీ మైనారిటీలకు వందశాతం ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అసైన్డ్ భూముల అభివృద్ధి కార్యక్రమం తీసుకుని, మైనారిటీ వర్గాలకు చెందిన రైతులకు ఉపయోగపడేలా చేయాలన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి