ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎ.పి. భవన్ తెలంగాణకు అప్పగించాలి : కె. చంద్రశేఖర్ రావు

న్యూఢిల్లీలో ఎ.పి. భవన్ ఆధీనంలో ఉన్న స్థలాన్ని తెలంగాణకు అప్పగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆ స్థలం హైదరాబాద్ రాష్ట్రానికి చెందింది కాబట్టి దానిపై పూర్తి హక్కు తెలంగాణకే ఉంటుందని సిఎం అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కు గురువారం లేఖ రాశారు. దేశ రాజధానిలో త్వరలోనే ఓ పద్ధతిగా, ప్రణాళికా బద్ధంగా తెలంగాణ భవన్ నిర్మించాలనుకుంటున్నామని, కాబట్టి సదరు స్థలాన్ని తమకు అప్పగించే విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని సిఎం ఈ లేఖలో కోరారు.
‘‘హైదరాబాద్ కు చెందిన నిజాం ప్రభుత్వం 1917, 1928, 1936 లో మూడు బిట్లుగా ఢిల్లీలో ఉన్న 18.18 ఎకరాల స్థలాన్ని విదేశీ, రాజకీయ వ్యవహారాల శాఖ నుంచి కొనుగోలు చేసింది. ఈ స్థలంలోనే ప్రస్తుతం హైదరాబాద్ హౌజ్, తెలంగాణ భవన్, ఎపి భవన్ ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ హౌజ్ ను కేంద్రం తీసుకుంది. పటౌడి హౌజ్లోని 7.56 ఎకరాలను, నర్సింగ్ ఇన్ స్టిట్యూట్ లోని 1.21 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించారు. ఆరవ నిజాం కాలంలోనే ఈ స్థలమంతా హైదరాబాద్ ప్రభుత్వానికి సమకూరింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ స్థలం ఉంది. 1948లో భారతదేశంలో విలీనమైన తర్వాత కూడా ఈ స్థలం హైదరాబాద్ స్టేట్ కే బదిలీ అయింది. అప్పుడు ఆంధ్ర ప్రభుత్వం లేదు. ఆంధ్ర ప్రాంతమంతా 1953 వరకు మద్రాస్ రాష్ట్రంలోనే ఉంది. 1956లో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే వరకు సదరు స్థలం హైదరాబాద్ స్టేట్ ప్రభుత్వం ఆధీనంలోనే కొనసాగింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. గతంలో హైదరాబాద్ స్టేట్ లో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతమే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాదు. 1956లో కలిసిన రెండు రాష్ట్రాలు 2014లో విడిపోయి ఎవరి రాష్ట్రాలుగా అవి చలామణి అవుతున్నాయి. ప్రస్తుతమున్న తెలంగాణ గతంలోని హైదరాబాద్ రాష్ట్రంలోని భాగమే. అలాగే ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా 1953 నుంచి 1956 వరకు ఇప్పుడున్న భూభాగంతోనే ఉండేది. కాబట్టి ఆ స్థలం తెలంగాణ ప్రభుత్వానికే చెందుతుంది. నిజాం రాజుల నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి బదిలీ అయిన ఈ స్థలం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికే చెందాలి. ఈ స్థలాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజించడానికి వీల్లేదు. 1956 వరకు రెండు వేర్వేరు రాష్ట్రాలుగా చలామణి అయిన రెండు రాష్ట్రాలకు ఢిల్లీలో రెండు వేర్వేరు భవన్లు ఉండాల్సి ఉండేది. నిజాం రాజుల నుంచి వచ్చిన స్థలాన్ని హైదరాబాద్ కు కేటాయించినట్లే, మద్రాస్ నుంచి వేరు పడిన ఆంధ్రకు ప్రత్యేకంగా ఢిల్లీలో స్థలం కేటాయించాల్సి ఉండేది. అలా కాకుంటే తమ జనాభా నిష్పత్తి ప్రకారం మద్రాస్ (ప్రస్తుత తమిళనాడు) రాష్ట్రానికున్న స్థలంలో ఆంధ్రకు వాటా ఇవ్వాల్సి ఉండేది. ఈ చారిత్రక ఆధారాలు, వాస్తవాలు గమనించి సదరు స్థలాన్ని తెలంగాణకు అప్పగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మేము త్వరలోనే అక్కడ పద్దతి ప్రకారం, ప్రణాళికా బద్ధంగా తెలంగాణ భవన్ నిర్మించాలనుకుంటున్నామని, కాబట్టి సత్వరం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను’’ అని ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు