వెనకబడిన తరగతులకు(బిసి) చెందిన కులాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, వారి అభ్యున్నతికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. బిసిలలో ఏఏ కులాలకు చెందిన వారి జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి? వారి అభ్యున్నతికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు.
మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల వల్ల, కొత్తగా నిర్మించే రిజర్వాయర్ల వల్ల మత్స్య సంపద పెద్ద ఎత్తున పెరుగుతుందని, దీని వల్ల చేపలు పట్టుకుని జీవించే వారికి పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఇదే విధంగా మిగతా కులాల జీవనోపాధికి మార్గాలు అన్వేషించాలని, ప్రభుత్వం ద్వారా ఎలాంటి సహాయం చేయాలో నిర్ణయించాలని చెప్పారు. బిసిలలో కూడా అన్ని కులాల ఆర్థిక పరిస్థితి ఒకేలా లేదని, బిసిల్లో బాగా వెనుకబడిన కులాల గురించి ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించాలని సిఎం సూచించారు.
కొత్తగా బిసి రెసిడెన్షియల్ విద్యాలయాలు:ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం కొత్తగా రెసిడెన్షియల్ విద్యాలయాలు ఏర్పాటు చేసినట్లే బిసిల కోసం కూడా గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23
రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయి. వీటిలో 16
పాఠశాలలను కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయాలని, ఇవి కాకుండా కొత్తగా బాల, బాలికల కోసం మరిన్ని రెసిడెన్షియల్ విద్యాలయాలు తెరవాలనే ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాలు నడుస్తున్నట్లే బిసి గురుకులాలు కూడా పనిచేయాలని సూచించారు. ఇందుకోసం ఎస్సీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రవీణ్ కుమార్ తో కలిసి బిసి సంక్షేమ శాఖ అధికారులు చర్చించాలని సూచించారు.
బిసిల కోసం వంద కోట్లతో ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీమ్
: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే బిసి విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించడానికి ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం ఓవర్సీస్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ నడుస్తున్నది. ఇదే తరహాలో బిసిలకు ఆర్థిక సహాయం అందించాలన్నారు. నిరుపేద బిసి విద్యార్థులు లబ్ది పొందేలా ఈ పథకం మార్గదర్శకాలు రూపొందించాలని సిఎం సూచించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి