ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ, విద్యుత్, సింగరేణిలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించడంతో పాటు అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రజలకు సేవలందించే ప్రభుత్వ రంగం సంస్థలను కాపాడడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల కనీస బాధ్యత అని, ప్రభుత్వ రంగ సంస్థలు బాగుపడితే అంతిమంగా ప్రజలే బాగుపడతారని , ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ, విద్యుత్ అంశాలపై క్యాంపు కార్యాలయంలో బుధవారం సిఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యానారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ, జెన్ కో సిఎండి డి. ప్రభాకర్ రావు, ఎస్పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, ఆర్టీసీ ఎండి రమణారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సమీక్షలో ఆర్టీసీ, విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం, ఆయా సంస్థల ఆదాయ-వ్యయాలు, వస్తున్న నష్టాలు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. గత ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడవం వల్ల ఆర్టీసీ, విద్యుత్ సంస్థలు కునారిల్లిపోయాయనే విషయం వెల్లడయింది. ముఖ్యంగా ఆర్టీసీ ఎప్పుడు మూత పడుతుందా అనే భయాందోళన ఉండేది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల ఫలితంగా విద్యుత్, ఆర్టీసీ సంస్థలు కోలుకున్నాయి. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాయి. అయినప్పటికీ ఆర్టీసీ, విద్యుత్ సంస్థలు ఇంకా నష్టాల్లోనే కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నష్టాల నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం, ఉద్యోగులు, ప్రజలు సహకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల ఊబినుంచి బయట పడేసేందుకు ప్రభుత్వం చేయాల్సినంత సహాయం చేస్తుందని, అదే సమయంలో ప్రజలు కూడా కొంత భారం మోయాల్సి వస్తుందని వెల్లడించారు.
విద్యుత్ సంస్థల నష్టాలకు నాలుగు కారణాలు
1. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విద్యుత్ సరఫరాను మెరుగుపర్చేందుకు ఖర్చుకు వెనకాడకుండా అదనపు సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, లైన్ల నిర్మాణం చేపట్టింది. దీనికోసం తెలంగాణలోని రెండు డిస్కమ్ లు, ట్రాన్స్ కో కలిపి రూ.2,144 కోట్ల అప్పులు చేశాయి.
2. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు తెలంగాణలో కోతల్లేని విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీనికోసం ఉత్పత్తికి మించిన విద్యుత్ అవసరమవుతున్నది. గత ఏడాది జలవిద్యుత్ (హైడల్ పవర్) కూడా ఉత్పత్తి కాలేదు. ఫలితంగా స్వల్పకాలిక పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు (పిపిఎ)తో విద్యుత్ కొనాల్సి వచ్చింది. దీనికోసం గత ఆర్థిక సంవత్సరంలో రూ.2700 కోట్లు ఖర్చు పెట్టాయి విద్యుత్ సంస్థలు.
3. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మెరుగుదల కోసం అధికారులు, ఉద్యోగులు కూడా చిత్తశుద్దితో పనిచేశారు. అందుకే ప్రభుత్వం వారి వేతనాలు పెంచింది. పెంచిన వేతనాల భారం కూడా విద్యుత్ సంస్థలపై పడింది.
4. రైతులకు పగటి పూట 9 గంటల కరెంటు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం విద్యుత్ సంస్థలు రూ.2,400 కోట్లు ఖర్చు చేసి సబ్ స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు, ఇతర కార్యక్రమాలు చేపట్టింది.
ఈ నాలుగు ప్రధాన కారణాల వల్ల విద్యుత్ సంస్థలపై చాలా ఆర్థికభారం పడిందని, దీన్నించి గట్టెక్కించడానికి విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తుందని సిఎం హామీ ఇచ్చారు.
సామాన్యులపై భారం పడకుండా విద్యుత్ చార్జీల పెంపు
రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై పలు ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సామాన్య ప్రజలపై, గృహ వినియోగదారులపై ఏమాత్రం అదనపు భారం పడకుండా చార్జీలు పెంచుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ సంస్థలను అవకాశం కల్పించారు. వంద యూనిట్ల లోపు గృహ విద్యుత్ వినియోగించే వారికి చార్జీలను పెంచవద్దని సిఎం ఆదేశించారు. వంద యూనిట్ల కన్నా ఎక్కువ వినియోగించే గృహ విద్యుత్ వినియోగదారులకు కూడా స్వల్పంగానే పెంచాలని సూచించారు. రాష్ట్రంలో 86 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లుంటే, అందులో 60 లక్షల కనెక్షన్లు 100 యూనిట్ల లోపు విద్యుత్ వాడేవి కావడం గమనార్హం. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల ఎక్కువ మంది వినియోగదారులపై పెంపు భారం పడదు.
పరిశ్రమలకు సహేతుక పెంపు
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు పరిశ్రమలకు అనుకూలమైన విధానం అవలంబించడంతో పాటు, ఐటి కంపెనీలు, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీనివల్ల కూడా విద్యుత్ సంస్థలపై భారీగా భారం పడింది. ఈ భారాన్ని కొంత మేర పంచుకోవాలని తెలంగాణ విద్యుత్ అధికారులు పరిశ్రమల నిర్వాహకులను కోరారు. ఇటీవలే వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలకు సరఫరా చేస్తున్న విద్యుత్ పదిశాతం పెంచడం తమకు ఆమోద యోగ్యమే అని యజమానులు చెప్పారు. ఇదే విషయాన్ని అధికారులు సిఎంకు తెలిపారు. అయితే పరిశ్రమలకు కూడా పదిశాతం కాకుండా, ఏడు శాతంలోపే పెంపుదల ఉండాలని సిఎం సూచించారు.
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు పరిశ్రమలకు అనుకూలమైన విధానం అవలంబించడంతో పాటు, ఐటి కంపెనీలు, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీనివల్ల కూడా విద్యుత్ సంస్థలపై భారీగా భారం పడింది. ఈ భారాన్ని కొంత మేర పంచుకోవాలని తెలంగాణ విద్యుత్ అధికారులు పరిశ్రమల నిర్వాహకులను కోరారు. ఇటీవలే వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలకు సరఫరా చేస్తున్న విద్యుత్ పదిశాతం పెంచడం తమకు ఆమోద యోగ్యమే అని యజమానులు చెప్పారు. ఇదే విషయాన్ని అధికారులు సిఎంకు తెలిపారు. అయితే పరిశ్రమలకు కూడా పదిశాతం కాకుండా, ఏడు శాతంలోపే పెంపుదల ఉండాలని సిఎం సూచించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి