“పరిపాలనా విభాగాల కూర్పు సందర్భంగా క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండేలా చూడాలి. ప్రతీ శాఖలో, ప్రతీ జిల్లాలో సమాన స్థాయిలో ఉద్యోగులు ఉండనక్కరలేదు. జిల్లాల్లో ఆయా శాఖల పనిభారాన్ని బట్టే ఉద్యోగులుండాలి. ఖమ్మం జిల్లాలో సెరికల్చర్ వుంది కాబట్టి అక్కడి సెరికల్చర్ అధికారులుండాలి. రంగారెడ్డి జిల్లాలో హార్టికల్చర్ ఉంది కాబట్టి అక్కడ ఆ శాఖ విస్తరించాలి.
హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమలు ఎక్కువ వున్నందున ఆ శాఖ మరింత బాగా పని చేయాలి. ఇలా ప్రతీ శాఖ తమకు ఎక్కువ పనిభారం ఎక్కడ ఉందో గమనించి ఉద్యోగులను సర్దుబాటు చేసుకోవాలి” అని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వంలో 64 ప్రభుత్వ శాఖలున్నాయి వాటిలో చాలా శాఖలు ఒకే స్వభావం కలిగినవి. అలాంటి వాటిని ఒకే అధికారి పరిధి కిందికి తేవాలని గతంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. దానికి అనుగుణంగా అధికారుల టాస్క్ ఫోర్స్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
మధ్యతరహా, చిన్నతరహా నీటిపారుదల శాఖకు ఒకే జిల్లా అధికారి వుంటారు. వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్ లకు కలిపి ఒకే అధికారిని నియమిస్తారు. విద్యాశాఖలో అన్ని విభాగాలకూ ఒకే అధికారి ఉంటారు. అటవీ శాఖ, సామాజిక అడవులు, వణ్యప్రాణి విభాగాలను కలిపేస్తారు. డి.ఆర్.డి.ఎ, డ్వామా, సెర్ప్ లాంటివన్నీ ఒకే శాఖగా మారతాయి. సంక్షేమ శాఖలు ఒకే గొడుగు కిందికి వస్తాయి. భారీ నీటి పారుదల శాఖ పరిపాలనా విభాగం మాత్రం జిల్లా యూనిట్ గా కాకుండా ప్రాజెక్టుల వారీగా వుంటుంది.
‘‘చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ సులభంగా వుంటుంది, దీని వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. అవినీతి, అక్రమాలను తగ్గించవచ్చు. ప్రభుత్వం, అధికారులు తలచుకుంటే ఏమైనా చేయగలరు. పేకాట, గుడుంబా లాంటివి బాగా అరికట్టగలిగాం. మిగతా వాటినీ అలాగే నియంత్రించగలుగుతాం’’ అని సిఎం చెప్పారు.
‘‘భారీ నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ వ్యవసాయం బాగా విస్తరిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖలను పటిష్టం చేయాలి. మైనారిటీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నందున, వాటిని అమలు చేసే యంత్రాంగం వుండాలి. అభివృద్ది, సంక్షేమ కార్యాక్రమాలన్నింటినీ కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించేలా అధికార వ్యవస్థ వుండాలి. ఎస్సీ, ఎస్టీ, బిసిల కోసం, పేదల జివితాల్లో మార్పు తేవడానికి చేపడుతున్న కార్యక్రమాలు మరింత బాగా అమలు కావడానికి చిన్న జిల్లాలు ఉపయోగపడతాయని నా నమ్మకం’’ అని సిఎం చెప్పారు. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్ ఏర్పాటు కోసం రూ. కోటి చోప్పున, పోలీస్ కార్యాలయాల ఏర్పాటుకు రూ. 50 లక్షల చోప్పున మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి లో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, అధికార యంత్రాంగం కూర్పుపై సమీక్షా సమావేశం మధ్యాహ్నం సెషన్ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి