కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అందాల్సిన సహాయం, అమలు చేయాల్సిన కార్యక్రమాల విషయంలో చొరవ చూపాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాష్ట్ర ప్రజా ప్రతినిధులంతా రాజకీయాలకతీతంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోవడానికి కేంద్రం నుంచి అందాల్సిన పథకాలు, నిధులు, ఇతర సహాయం సకాలంలో రావాలని సిఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు, సహచర మంత్రులతో మాట్లాడి పెండింగ్ లో వున్న పనుల విషయంలో తగిన చొరవ చుపాలన్నారు.
ఢిల్లీలోని దత్తాత్రేయ నివాసంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గురువారం ఆయనను కలిశారు. మంత్రి చందూలాల్, రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, డి. శ్రీనివాస్, లోక్ సభ నాయకుడు జితేందర్ రెడ్డి, ఎంపి వినోద్ కుమార్, ఇతర ఎంపీలు, ఎమ్మేల్యేలు ముఖ్యమంత్రి వెంట వున్నారు.
కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో వున్న పనుల జాబితాను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి అందించారు. వెనుకబడిన జిల్లాలకు అందాల్సిన రెండో విడత ఆర్థిక సహాయం విడుదలయ్యేలా చూడాలని కోరారు. రామగుండంలో ఫర్టిలైజర్ ప్లాంటు పునరుద్ధరణ ప్రధాన మంత్రి స్వయంగా శంఖుస్థాపన చేసినందున, వెంటనే పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా కేంద్ర మంత్రులతో మాట్లాడి పెండింగ్ పనులు త్వరగా జరిగేలా చూస్తానని దత్తాత్రేయ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రానికి సానుభూతి, ప్రేమ వున్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ పట్ల ప్రధాని సహా కేంద్రంలో అందరికీ ప్రత్యేక అభిమానం, గౌరవం వున్నాయన్నారు. పార్లమెంటులో తెలంగాణ ఎంపీల వ్యవహారశైలిపై ప్రభుత్వానికి, స్పీకర్ కు సంతృప్తి వుందన్నారు. భారతదేశానికి సంబధించిన విధానపరమైన చర్చల్లో తెలంగాణ ఎంపీలు క్రియాశీలక పాత్ర పోషించడం అందరి మన్ననలు పొందిందని కేంద్ర మంత్రి ప్రశంసించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి