భారీ వర్షాలు, వరదల వల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనడానికి ప్రభుత్వంలోని అన్ని శాఖలు సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఆస్తి నష్టం జరిగితే ఎలాగోలా పూడ్చుకోవచ్చని, కానీ ప్రాణనష్టం జరిగితే పూడ్చలేమని సిఎం అన్నారు. కాబట్టి ప్రాణనష్టం జరగకుండా చూడాలని చెప్పారు. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ సమాచారం సేకరించాలని, అవసరమైన సూచనలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మను ఆదేశించారు. భారీ వర్షాల వల్ల పట్టణాలు, గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. వర్షాలు, వరదల వల్ల మనుషులు, పశువుల ప్రాణాలు పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కోరారు. అధికారుల సూచనలు పాటించి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. రాష్ట్రంలో పరిస్థితిపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండి కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయంతో పనిచేయాలని, జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు వచ్చిన సమాచారం ఆధారంగా స్పందించాలని కోరారు. అన్ని శాఖలూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
గోదావరి నది ఉప్పోంగుతున్నదని, ప్రమాదస్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఎగువనున్న మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తున్నదని, తెలంగాణ పరిధిలోని ఎస్ఆర్ఎస్పి, నిజాంసాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, సింగూరు తదితర ప్రాజెక్టులన్నీ నిండాయని చెప్పారు. వాటి నుంచి నీరు విడుదల చేస్తున్నందున గోదావరికి గంటగంటకూ నీటి ప్రవాహం పెరగుతూనే ఉంటుందన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి, తెలంగాణ లోని వివిధ ప్రాంతాల్లోని వాగులు, వంకల ద్వారా పెద్ద ఎత్తున నీరు గోదావరిలో చేరుతున్నదన్నారు. కాబట్టి కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గోదావరి ప్రవాహ ఉధృతి ఈ రాత్రికి ఎనిమిది లక్షల క్యూసెక్కులకు చేరుతుందనే అంచనా ఉందన్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఏటూరు నాగారం వద్ద బస చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని కలెక్టర్ కరుణను, భద్రాచలం వద్ద ఉండి ఎప్పటికప్పుడు స్పందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావును సిఎం ఆదేశించారు. ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలను, పశువులను ఖాళీ చేయించాలని చెప్పారు.
గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండుతున్నాయని, లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నదని ముఖ్యమంత్రి అన్నారు. ఇన్ ఫ్లోలను బట్టి ఔట్ ఫ్లోలను నిర్ధారించుకోవాలని మంత్రి హరీష్ రావును ఆదేశించారు. ప్రతీ ప్రాజెక్టు వద్ద నీటి పారుదల శాఖ అధికారులను అప్రమత్తంగా ఉంచి, పర్యవేక్షించాలని మంత్రికి చెప్పారు. గండిపేట, హిమాయత్ సాగర్ తో పాటు రాష్ట్రంలోని దాదాపు అన్ని చెరువులు నిండుతున్నాయని, చెరువుల అలుగుపోయడంతో గ్రామాల్లో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. కరువు తీరిపోయే విధంగా, మరో రెండేళ్ల వరకు కరువు దరిచేరని విధంగా వర్షాలున్నాయన్నారు. చెరువుల్లోకి నీరు రావడం వల్ల భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని బోర్లకు ఇది ఎంతో ఉపయోగకరమన్నారు. గోదావరి, కృష్ణ నీళ్లను హైదరాబాద్ మంచినీటి అవసరాల కోసం వాడాలని, గండిపేట, హిమాయత్ సాగర్ నీళ్లను యధావిధిగా ఉంచడం వల్ల నగర పరిధిలో భూగర్భ జలమట్టం పెరుగుతుందన్నారు. ఇదే సందర్భంలో చెరువు కట్టలను ఎప్పటికప్పుడు గమనించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల జరగడం, చెరువులు అలుగు పోస్తుండడంతో వాటిని చూడడానికి వెళ్లే సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. నీటిలో దిగడం అత్యంత ప్రమాదకరమని ముఖ్యమంత్రి చెప్పారు. నదులు, కాలువల్లో కూడా వరద ప్రవాహం ఎక్కువగా ఉంది కాబట్టి, సందర్శకులు వాటిలో దిగవద్దని కోరారు. పోలీసులు కూడా ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి