ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చొరవతో మూతపడిన నల్గొండ జిల్లా ఆలేరు రైల్వేగేటును తిరిగి తెరిచేందుకు మార్గం సుగమమైంది. రెండు నెలలుగా మూసి ఉన్న రైల్వే గేటు మంగళవారం తెరుచుకోనుంది. ఆలేరు పట్టణంలో ఇటీవలే కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించారు. దాని ఫలితంగా రైల్వే శాఖ ఆలేరు పట్టణంలోని రైల్వే గేటును మూసి వేసింది. అయితే రైల్వే గేటు మూసివేత వల్ల ఆలేరు పట్టణ ప్రజలు అటు ఇటు వెళ్లిరావడానికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. హైదరాబాద్, నల్గొండ ప్రాంతాల నుంచి వరంగల్ జిల్లా బచ్చన్నపేట, కొమురవెల్లి, మెదక్ జిల్లా జగదేవ్ పూర్, రంగారెడ్డి జిల్లా కీసర తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బంది కలుగుతున్నది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విప్ గొంగిడి సునిత ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఆలేరులో పాత రైల్వే గేటు ప్రాంతంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని ఇటీవల విన్నవించారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్.యు.బి.కి అయ్యే ఐదు కోట్ల 25 లక్షల వ్యయాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఆర్.యు.బి. నిర్మాణం జరిగే వరకు గేటును తెరవాలని రైల్వే శాఖను కోరారు. దీంతో రైల్వే శాఖ కూడా సానుకూలంగా స్పందించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు గేటును తెరవడానికి అంగీకరించింది. దీనికి ముందుగానే ఆర్.యు.బి. నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలనే షరతు పెట్టింది. దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఐదుకోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం నుంచి రైల్వే గేటు తెరవాలని నిర్ణయం జరిగింది. ఆర్.యు.బి. నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేయడంతో పాటు, రైల్వే గేటు తెరిచేలా రైల్వే శాఖను ఒప్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, ఆలేరు జడ్పిటిసి బొట్ల పరమేశ్వర్, మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు ఆకవరపు మోహన్ రావు, ఎంపిటిసి చింతకింది మురళి, సర్పంచ్ దాసి సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులను గొంగిడి సునితకు అందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి