తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎపి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో పెండింగ్ లో ఉన్న కేసులన్నీ హైదరాబాద్ లోని ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆర్డినెన్స్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అవసరం లేదని భావించి, దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో కోరింది. దీంతో ఎపి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పరిధిలోకి తెలంగాణ రాష్ట్రం రాదని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15న గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ విచారణలో ఉన్న కేసులను హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఇప్పటి వరకు ట్రిబ్యునల్లో పెండింగ్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని కేసుల విచారణ ఇకపై హైకోర్టులో జరుగుతుంది. కేసుల విచారణకు సంబంధించిన సమాచారం కూడా ఇప్పటి నుంచి కక్షిదారులకు హైకోర్టు ద్వారానే అందుతుంది. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రస్తుతం జరగడం లేదు కనుక, రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు మేరకు గవర్నర్ ఈ ఆర్డినెన్స్ జారీ చేశారు. ...