ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వచ్చే ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సిఎం అధికారులకు సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తెచ్చే విధంగా చర్యలు కూడా తీసుకోవాలని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై క్యాంపు కార్యాలయంలో ఆదివారం సిఎం సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపి కె. కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి సి. నర్సింగ్ రావు, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.
1917లో ప్రారంభమయిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గడించిందని సిఎం చెప్పారు. ఈ యూనివర్సిటీలో చదివిన ఎందరో విద్యార్థులు దేశ, విదేశాల్లో చాలా రంగాల్లో ఎదిగారని వివరించారు. వివిధ దేశాల్లో వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో పట్టా పొందడాన్ని ఎంతో గొప్పతనంగా, ప్రత్యేకమైనదిగా భావించే వారని, తమ నేమ్ ప్లేట్లో విద్యార్హతల పక్కన ఉస్మానియాలో చదివినట్లు సూచించే విధంగా (OSM) అని పెట్టుకునే వారని సిఎం చెప్పారు. ఇప్పటికీ వివిధ రంగాల్లోని ప్రముఖుల్లో ఉస్మానియా నుంచి చదివిన వారు అనేక మంది ఉన్నారన్నారు. అలాంటి యూనివర్సిటీకి పూర్వ వైభవం తేవాల్సిన అవసరం ఉందని సిఎం అన్నారు. శతాబ్ధి ఉత్సవాల సందర్బంగా యూనివర్సిటీకి ఏమి కావాలి? ఏ చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖను ఆదేశించారు.
త్వరలోనే యూనివర్సిటీకి పూర్తి కాల విసి నియామకం జరుగుతుందని, యూనివర్సిటీకి పూర్వ వైభవం తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిఎం అన్నారు. ఉస్మానియా పూర్వ విద్యార్థి, ఎంపి కె. కేశవరావు లాంటి అనుభవజ్ఞులు, యూనవర్సిటీతో అనుబంధం ఉన్న వారితో సలహా మండలిని నియమించి, శతాబ్ది ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఉస్మానియాలో చదివి విదేశాల్లో వివిధ వృత్తుల్లో స్థిరపడిన వారిని భాగస్వాములు చేయడం కోసం ఉత్సవాల్లో భాగంగా ఎన్ఆర్ఐ సదస్సును కూడా నిర్వహించాలన్నారు. 1975 వరకు తెలంగాణ విద్యాసంస్థలన్నీ ఉస్మానియా యూనివర్సటీ పరిధిలోకి వచ్చేవని చెప్పారు. ఈ యూనివర్సిటీలో చదివి వివిధ రంగాల్లో స్థిరపడిన వారందరినీ ఉత్సవాలలో భాగస్వాములను చేయాలని కోరారు. యూనివర్సటీలో చదివిన విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, న్యాయమూర్తులు, సాహితీ వేత్తలు, సివిల్ సర్వీస్ అధికారులు, కార్పొరేట్ సంస్థల నిర్వహకులు, జర్నలిస్టులు, క్రీడాకారులు, ఇతర ప్రముఖుల జాబితా రూపొందించి, వారందరినీ ఆహ్వానించాలని సూచించారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి