అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వి.ఓ.ఎ.) వేతనం పెంచాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్రంలో 18,405 మంది వి.ఓ.ఎ.లు రూ.500 నుంచి రూ.1,500 వరకు వేతనం మాత్రమే పొందుతున్నారు. ఆయా సంఘాల సభ్యుల సంఖ్య, వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వేతనాలు అందుతున్నాయి. అయితే వీరు చేసే పనికి వస్తున్న జీతం ఏమాత్రం సరిపోవడం లేదని రాష్ట్రంలోని వి.ఓ.ఎ.లు ఎప్పటి నుంచో ఆవేదనతో ఉన్నారు. గ్రామైక్య సంఘాలు ఇచ్చే డబ్బులతో పాటు ప్రభుత్వం కూడా తమకు కొంత వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. సమైక్య రాష్ట్రంలో వి.ఓ.ఎ.లు అప్పటి సమైక్య ప్రభుత్వానికి ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లభించలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బుధవారం ప్రగతి భవన్లో వి.ఓ.ఏ.లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతీ వి.ఓ.ఎ.కు నెలకు రూ.5వేల జీతం అందేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామైక్య సంఘాలు రూ.2వేలు చెల్లించాలని, ప్రభుత్వం రూ.3వేలు ఇస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తన వాటాను సెర్ప్ ద్వారా చెల్లిస్తుందన్నారు. గ్రామైక్య సంఘాల వాటాను చెల్లించే బాధ్యత సూపర్ వైజర్లు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
‘‘గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా గ్రామాల్లో డ్వాక్రా మహిళల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవ్వాలి. రాష్ట్రంలో మహిళా సంఘాలు బాగా నడుస్తున్నాయి. మంచిపేరు వచ్చింది. కేవలం పొదుపుతోనే సరిపెట్టుకోకుండా కుటీర పరిశ్రమలు నడపాలి. గ్రామాల్లో దొరికే వస్తువులను మార్కెట్ అవసరాలు తీర్చే విధంగా డ్వాక్రా సంఘాల మహిళలు ప్రాసెసింగ్ చేయాలి. కారంపొడి, పసుపు పొడి, పాపడాలు, కార, బొంది లాంటి డిమాండ్ ఉన్న వస్తువులను తయారు చేయాలి. అప్పుడు ప్రజలకు కల్తీలేని సరుకులు దొరుకుతాయి. మహిళలకు ఉపాధి లభిస్తుంది. డ్వాక్రా మహిళలలకు అవసరమైన శిక్షణ, చేయూత అందిస్తాం. వేరే రాష్ట్రాల్లో, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మహిళా సంఘాలు ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయాలి. పూర్తి స్థాయి కార్యక్రమాన్ని రచించి అమలు చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి