రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం రోజురోజుకూ దూకుడు పెంచుతోంది. విభజన వద్దంటూ సీమాంధ్ర ప్రజలు ఎంతగా గగ్గోలు పెడుతున్నా... ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా... ఎక్కడా తగ్గడం లేదు. ఎవరేమనుకుంటే లేక్కేమిటి అన్నట్టుగా.... తాను అనుకున్నది తాను చేసుకుపోతోంది. కోస్తా జిల్లాలు భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లుతోంటే... నష్టం అంచనాకి కేంద్ర బృందాన్ని పంపించాల్సింది పోయి... విభజన కోసం టాస్క్ ఫోర్స్ ని పంపించింది. ఏదెలా ఉన్నా తనకు విభజనే ముఖ్యమన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇలా జీవోఎం... తనపని తాను చేసుకుపోతోంటే... కేంద్ర హోం శాఖ టాస్క్ ఫోర్స్ కమిటీ హైదరాబాద్ వచ్చింది. విభజన అనంతరం రక్షణ, శాంతి, భద్రతలు తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేపట్టింది. తొలిరోజు సమావేశంలో ఉన్నతాధికారులు, మాజీ డీజీపీలు హాజరయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఎదురయ్యే శాంతి భద్రతల సమస్యలపై ఈ బృందం చర్చలు జరిపింది. పోలీసు సిబ్బందిని ఎక్కడెక్కడ ఎంతమందిని ఉంచాలి.... ఆస్తుల పంపిణీ ఎలా అనే సమాచారాన్ని కూడా హోం శాఖ టాస్క్‌ఫోర్స్ కమిటీ సేకరిస్తోంది. ఈ బృందం గురువారం మధ్యాహ్నం మరోసారి భేటీ అవుతుంది.