తెలంగాణ రాష్ట్రంలో థర్మల్, హైడల్ విద్యుత్ పాటు పవన, సౌర విద్యుత్ ఉత్పత్తికి గల అవకాశాలను కూడా పరిశీలించాలని, దీనిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. విద్యుత్ ఉత్పత్తి రంగంలో అనుభవం ఉన్న గ్రీన్ కో ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి పలు ప్రతిపాదనలు అందించారు. తెలంగాణ రాష్ట్రంలో 2018 వరకు 800 మెగావాట్లకు పైగా సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేస్తామని, ఆరు వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రతిపాదించారు. అవసరమైన స్థలం కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో థర్మల్, హైడల్ తో పాటు పవన్ విద్యుత్, సౌర విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ఒక దఫా సౌర విద్యుత్ కోసం టెండర్లు పిలిచామని, అవసరమైతే మరోసారి టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి చెప్పారు.
రాష్ట్రంలో దాదాపు 2 వేల మెగావాట్ల వరకు వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఉన్నదని, పగటి పూట విద్యుత్ అందించే సోలార్ వ్యవస్థను వ్యవసాయ పంపుసెట్లకు అనుసంధానం చేస్తే ఉభయ తారకంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. అటు పగటి పూట కరెంటు అందివ్వవచ్చని, సోలార్ విద్యుత్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. పవన్ విద్యుత్ కూడా ఎక్కువ చోట్ల పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ సామర్థ్యం కలిగిన విద్యుత్ అవసరాలు ఉన్న చోట పవన విద్యుత్ చాలా ఉపయోగమన్నారు. రాష్ట్రంలో కొన్ని ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రయోగాత్మకంగా పవన్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించాలని, ఇప్పటికే అనుభవం ఉన్న సంస్థలతో ఈ పని చేయించాలని ముఖ్యమంత్రి చెప్పారు. న్యూయార్క్, ముంబాయి నగరాలలో 24 గంటల కరెంటు అందుబాటులోకి తెచ్చినట్లే హైదరాబాద్ నగరంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు, ఐటి సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు 24 గంటల పాటు పనిచేసినా కూడా విద్యుత్ కొరత లేని విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఎంపిలు కె. కేశవరావు, బూర నర్సయ్య, ఎంఎల్సి సలీం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, ఎస్.కె. జోషి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి