తునీసియాలో నిర్మిస్తున్న కొత్త నగరం తరహాలో హైదరాబాద్‌ను అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. సౌది అరేబియా రాయల్ ఫామిలీ ప్రతినిధి డాక్టర్ ఫయిజ్ అల్ అబెడీన్ మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు, కొత్త ప్రభుత్వాని ఏర్పాటు చేసి అభివృద్ది పథంలో నడుస్తున్నందుకు సౌది అరేబియా రాజు పంపిన అభినందన వర్తమానాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్బంగా ఫయిజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఓ ఆదర్శవంతమైన లౌకిక రాష్ట్రంగా ముందుకు పోతున్నదన్నారు. ముస్లింలకు అత్యంత ఆదరణ లభిస్తున్నదని చెప్పారు. పునర్‌నిర్మాణ దశలో ఉన్న తెలంగాణకు సహకారం అందించాలని తాము నిర్ణయించుకున్నామని చెప్పారు. విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పడం, నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, వైద్య రంగంలో సహకరించడం లాంటి లక్ష్యాలు తమకు ఉన్నాయన్నారు. కొత్తగా నిర్మిస్తున్న తునీసియా నగర నమూనాను ముఖ్యమంత్రికి చూపించారు. ఎంటర్‌టైన్‌మెంట్ సిటి, స్పోర్ట్స్ సిటి లాంటి 16 వేరు వేరు సిటీలతో నిర్మాణంలో ఉన్న తునీసియా కొత్త నగర అనిమేషన్ దృశ్యాలను కూడా చూపించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టు ప్రక్కల కూడా సినిమా సిటి, స్పోర్ట్స్ సిటి, ఫార్మా సిటి తదితర సిటీలను నిర్మించాలని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. మంచి వాతావరణం, సహృద్బావ సంబంధాలు, మౌలిక వసతులు ఉన్న హైదరాబాద్ నగరానికి చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉందన్నారు. తునీసియా కొత్త నగరంలాగా అభివృద్ది చెందుతూనే గత చరిత్ర ఆనవాళ్లు చెదిరిపోకుండా ఇస్తాంబుల్ తరహాలో హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్నది తన ఉద్దేశమని వెల్లడించారు. భవిష్యత్తులో హైదరాబాద్‌లో ఐటి పరిశ్రమ మరింత అభివృద్ది చెందుతుందని తాము అమల్లోకి తెచ్చిన పారిశ్రామిక సింగిల్‌విండో విధానం కూడా తెలంగాణకు పెట్టుబడులను తెస్తాయని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి సౌది అరేబియా సహకారం తీసుకుంటామని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, విద్యుత్ శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి