నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (నాక్) పేరును నేషనల్ అకాడమీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (నాస్ డాక్) గా మార్చాలని గవర్నింగ్ బాడి సమావేశంలో నిర్ణయించారు. నాక్ గవర్నింగ్ బాడి సమావేశం మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగింది. నిర్మాణ రంగంలో కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకునే విధంగా నాక్ తయారు కావాలని ముఖ్యమంత్రి కోరారు. నిర్మాణ రంగంలోని వివిధ విభాగాలకు చెందిన వారిలో వృత్తి నైపుణ్యం పెంచే విధంగా శిక్షణా కార్యక్రమాలు ఉండాలన్నారు. అందుకే నాక్ పేరును నాస్ డాక్ గా మార్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నాక్ ఉద్యోగుల జీతాలను 20 శాతం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ ఇంజనీరింగ్ గ్రాడ్యూయెట్లకు తగు శిక్షణ ఇవ్వాలని, క్లాస్ 1 కాంట్రాక్టర్ల వద్ద శిక్షణనిప్పించి వారిని నిలదొక్కుకునేలా తయారు చేయాలని సూచించారు. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ప్రకారం నిర్మాణాలు జరిగే విధంగా నాక్ చొరవ చూపాలన్నారు. తక్కువ స్తలంలో ఎక్కువ మంది చాలా సౌకర్యవంతంగా విధులు నిర్వహించే విధంగా భవన నిర్మాణ డిజైన్‌లు ఉండాలన్నారు.
సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రాజీవ్‌శర్మ, మంత్రి శ్రీ ఈటెల రాజేందర్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగరావు, ఆర్ అండ్ బి శాఖ కార్యదర్శి శ్రీ సునిల్ శర్మ, నాక్ డిజి శ్రీ బిక్షపతి తదితరులు పాల్గోన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి