యాదాద్రి జిల్లాను ‘‘యాదాద్రి భువనగిరి’’ జిల్లాగా పిలవాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. టెంపుల్ సిటీగా యాదగిరిగుట్ట, జిల్లా కేంద్రంగా భువనగిరి జంటగా అభివృద్ది చెందుతాయని సిఎం అన్నారు. దీనికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెంచాలని సూచించారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచిన భువనగిరిలోని ఎలిమినేటి క్రిష్ణారెడ్డి ఇంటికి బుధవారం సాయంత్రం సిఎం వెళ్లారు. ఆరోగ్యం, కుటుంబ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యమ సమయంలో గడిపిన సందర్భాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. జిల్లా కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో భువనగిరి పట్టణం చాలా అభివృద్ది చెందుతుంది అన్నారు. ఎంఎంటిఎస్, రీజినల్ రింగ్ రోడ్ భువనగిరి నుండే వెళతాయి కాబట్టి రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని సిఎం హామి ఇచ్చారు.
రాబోయే కాలంలో యాదాద్రిని సందర్శించే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని దీనికి అనుగుణంగా యాదాద్రిలో వసతి, రహదారులు, క్యూలైన్ల వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. రోజుకు లక్ష మందికి పైగా భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దైవ దర్శనం, ఇతర సంప్రదాయ ఆచారాలు, పూజలు నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు వుండాలన్నారు.
బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి యాదాద్రిలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన ఆలయం వున్న యాదాద్రిలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. గర్భగుడితో పాటు ప్రధాన ఆలయ పునర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున తాత్కాలిక దర్శనం కోసం నిర్మించిన బాలాలయాన్ని సిఎం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వీలైనంత వరకు భక్తులకు ఇబ్బంది కలుగకుండానే అభివృద్ది జరగాలన్నారు. మూడంతస్తుల క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని, ప్రతిపాదిత హనుమంతుడి విగ్రహ స్థలాన్ని, వంటశాల ప్రదేశం, ప్రసాదాల తయారీల ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. అగ్నేయ ప్రాంతంలో వుండాల్సిన నిర్మాణాలపై తగు సూచనలు చేశారు. స్నాన గుండం, మంచినీటి సరఫరా వ్యవస్థ, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ సరఫరా కోసం చేస్తున్న ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రధాన ఆలయానికి సమీపంలోనే వుండే టెంపుల్ సిటి ప్రతిపాదిత గుట్టను ముఖ్యమంత్రి పరిశీలించారు. మొదటి దశలో 200 కాటేజీలు, ఉద్యానవనాలు, రోటరీలు, క్యాంటిన్ తదితర నిర్మాణాలతో కూడిన లే ఔట్ ను సిఎం పరిశీలించారు. గుట్ట పై భాగంలోని ఎత్తు పల్లాలను పరిగణలోకి తీసుకుని కాటేజీల నిర్మాణం చేపట్టాలన్నారు. అనంతరం ప్రధాన ఆలయానికి ఈశాన్య భాగంలో వుండే 13 ఎకరాల విస్తీర్ణంలోని గుట్టను పరిశీలించారు. ప్రెసిడెంట్ సూట్ తో పాటు వివిఐపిలకు కేటాయించడానికి అక్కడ 15 సూట్స్ ను నిర్మించే ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. గుట్ట దిగువ భాగంలో బస్టాండ్, గోశాల తదితర నిర్మాణాల స్థలాన్ని ముఖ్యమంత్రి పరిశీలించి ఎక్కడ ఎ నిర్మాణం రావాలో సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రికి సమీపంలోనే గంధమల్ల, బస్వాపురం రిజార్వాయర్లు వస్తున్నాయని, వీటితో పాటు గుట్టకు ఆనుకుని వున్న చెరువులను కూడా మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ది చేయాలని సిఎం సూచించారు.
అభివృద్ధి పనుల ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయనున్న గుట్ట ప్రాంతంలో అవసరమైనంత స్థలాన్ని సేకరించాలని సూచించారు. యాదాద్రిలో ఇప్పటికే భక్తుల రద్దీ ఎక్కువైందని, భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని సిఎం చెప్పారు. దీనిని దృష్టిలో వుంచుకుని గుట్టకు నలువైపుల నాలుగు వరసల రహదారులు నిర్మించాలని సూచించారు. వంగపల్లి నుండి గుట్టకు రావాడానికి నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. స్వామి వారి పూజకు అవసరమయ్యే పూలు పూయించడానికి అవసరమయ్యే మొక్కలు స్థానికంగానే పెంచాలని, ఉద్యాన వనాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా యాదాద్రిలోనే నర్సరీ ఏర్పాటు చేయాలని అటవీ శాఖాధికారులను ఆదేశించారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారమే యాదాద్రిలో ఏ నిర్మాణమైనా జరగాలని సూచించారు. యాదాద్రిలో కాటేజీల నిర్మాణానికి అనేక మంది దాతలు, సంస్థలు ముందుకొస్తున్నారని త్వరగా లేఔట్లు రూపొందించి నిర్మాణాలు ప్రారంభించాలన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి