తెలంగాణ కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన కార్యాలయాలు కొత్తగా ఏర్పాటు చేయాల్సిందే తప్ప ఎక్కడ కూడా ఉన్న కార్యాలయాలు తొలగించవద్దని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్లో కార్యాలయాలు తరలిస్తారనే ప్రచారం జరుగుతున్నదని మంత్రి లక్ష్మారెడ్డి, ములుగులో ఏ ఒక్క కార్యాలయాన్ని తరలించవద్దని మంత్రి చందూలాల్, మరిపెడలో కార్యాలయాలు తరలించవద్దని మాజీ మంత్రి రెడ్యానాయక్ ముఖ్యమంత్రిని కోరారు. మరికొందరు ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి వినతులే ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ముఖ్యమంత్రి విస్పష్టమైన ఆదేశిలిచ్చారు.
‘‘రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ పట్టణాలు, ప్రాంతాల్లో వివిధ స్థాయిల కార్యాలయాలున్నాయి. కొత్తగా మళ్లీ జిల్లాలు, డివిజన్లు, మండలాలు వస్తున్నాయి. కొత్తగా కార్యాలయాలు అవసరం ఉన్న చోట ఏర్పాటు చేయండి. కానీ ఒక్క చోట నుంచి కూడా ఒక్క కార్యాలయాన్ని కూడా వేరే చోటకి తరలించవద్దు. సౌకర్యాలు పెంచేందుకు పరిపాలన విభాగాలు పెంచుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే ఉన్న సౌకర్యాలను తొలగించడం సబబు కాదు. కాబట్టి ఏ కార్యాలయాన్ని కూడా మరో చోటికి తరలించవద్దని” ఆదేశించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి