భారీ వాహనాల ఉత్పత్తిలో ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్న అశోక్ లేలాండ్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో బాడీ బిల్డింగ్ యూనిట్ నెలకొల్పే ఒప్పందం కుదుర్చుకుంది. 500 కోట్లతో దశల వారీగా నెలకొల్పే ఈ యూనిట్ ద్వారా 1000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వందల మందికి ఉపాధి లభించనుంది. ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, పరిశ్రమలు, ఐటి, మున్సిపల్ శాఖల మంత్రి కెటి. రామారావు, విద్యుత్, షెడ్యూల్ కులాల శాఖల మంత్రి జి. జగదీష్ రెడ్డిల సమక్షంలో సోమవారం నాడు క్యాంప్ కార్యాలయంలో సిఎం అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి, అశోక్ లేలాండ్ కంపెనీ ఎం.డి వినోద్ కె దాసరి అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూ) మార్చుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాట్లాడుతూ ఉత్పాదక రంగాలకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. పరిశ్రమలకు భూమి, ఇతర మౌళిక సౌకర్యాలు కల్పించడంతో పాటు అన్ని రకాల అనుమతులను 15 రోజుల్లో మంజూరు చేసేందుకే టిఎస్ఐపాస్ విధానాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. తెలంగాణ ఆర్.టీ.సికి, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన వాహనాలను ఇక్కడ నెలకొల్పిన పరిశ్రమల నుండే కొనుగోలు చేయడానికి ప్రాధాన్యమిస్తున్నట్లు సిఎం తెలిపారు. జీ.హెచ్.ఎం.సీకి అవసరమైన వాహనాలను తెలంగాణలో నెలకొల్పిన పరిశ్రమల నుండే కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో మాస్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం మెరుగుపరచడానికి అశోక్ లేలాండ్ కంపెనీ సలహాలు తీసుకోవాలని ట్రాన్స్ పోర్ట్, ఆర్.టీ.సి అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో పట్టణ జనాభా 45 శాతం ఉందని వారికి సౌకర్యంగా ఉండేలా రవాణా వ్యవస్థను మెరుగు పరచడానికి తాము కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని సిఎం వివరించారు. తెలంగాణ జిల్లాల నుండి హైదరాబాద్ కు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళే ప్రయాణీకులు లక్షల్లో ఉన్నారని, భవిష్యత్తులో రవాణా వ్యవస్థ ఇంకా మెరుగు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పరిశ్రమల కమిషనర్ మాణిక్ రాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, టిఎస్ఐఐసి ఎండి ఇవి నర్సింహారెడ్డి, అశోక్ లేలాండ్ సీనియర్ వైస్ ప్రసిడెంట్స్ పి. వెంకట్రామన్, ఇ. హరిహర్, హిందూజా ఫౌండేషన్ సిఇవో డిఎం రెడ్డి, ఇడి రాజీవ్ సింఘ్వి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి