అభివృద్ధి దిశగా పయనిస్తున్న నూతన తెలంగాణ రాష్ట్రం దేశ విదేశాల ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో దిగ్గజమైన ఇండియన్ బ్యాంక్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
ఈ మేరకు ఇండియన్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ సి.ఇ.ఓ ఎం.కె జైన్ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును సోమవారం క్యాంపు కార్యాలయంలో తన బృందంతో కలిసారు. హెచ్.ఎమ్.డి.ఏ., జీ.హెచ్.ఎం.సీ పరిధిలో ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు ఆర్ధిక సహకారం ఋణం రూపంలో అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలో అభివృద్ధి కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్న పట్టణాల పరిధిలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు తమ సంసిద్ధతను సిఎంకు బ్యాంకు ఎండీ వ్యక్తపరిచారు.
కాగా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు ఇండియన్ బ్యాంకు ముందుకు రావడం శుభపరిణామమని, వారిని తాను ఆహ్వానిస్తున్నానని సిఎం తెలిపారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ఇతర అభివృద్ధి, సేవారంగంలో వ్యవస్థల బలోపేతానికి ఇండియన్ బ్యాంకు అందించే ఆర్ధిక సహకారం దోహదం పడుతుందని సిఎం ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, అదనపు ప్రిన్సిపల్ సెక్రెటరీ శాంతికుమారి, టిఎస్ఐపాస్ ఎండీ నరసింహారెడ్డి, సమాచారశాఖ కమీషనర్ నవీన్ మిట్టల్, మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి