కష్టాన్ని కళ్ల కింద దాచిపెట్టి.. సంతోషాన్ని చేతి నిండా పంచిపెట్టే విధాత నాన్న! తన కోసం ఏదీ దాచుకోవాలని అనుకోనివాడు.. త్యాగాలకు ప్రతిరూపం నాన్న! కుటుంబం కోసం తన సర్వం ధారపోసే వాడు నాన్న.. ఎంత చేసినా నాన్న అణుమాత్రంగానే ఎందుకు మిగిలిపోతున్నాడు? ఆయన మనస్సు ఎందుకు అర్థం కాదు? అమ్మ అమృతమైతే.. దాన్ని నింపే కలశం నాన్న...అమ్మ దీపంలా వెలగాలంటే.. వత్తిలా నాన్న ఉండాల్సిందే.. ఒక్కమాటలో చెప్పాలంటే తండ్రి త్యాగాల గుర్తు. అమ్మ ప్రేమ కంటి ముందుంటే.. నాన్న ప్రేమ మాత్రం గుండె లోతుల్లో ఉంటుంది. నాన్న ఏది చేసినా కుటుంబం కోసమే.. పిల్లల అభివృద్ధి కోసమే.. తన పిల్లలకు ఆయనే రోల్ మోడల్.అమ్మ మెరిసే మేఘం.. నాన్న నీలాకాశం.. నాన్నను ఎప్పుడూ మనం ఒకే కోణంలో చూస్తాం.. గంభీరంగా కనిపించే వ్యక్తిలానే చూస్తాం.. కానీ నాణానికి రెండో వైపు నాన్నని అర్థం చేసుకోవాలంటే ముందు మనకంటూ అర్థం చేసుకునే మనసు ఉండాలి..పిల్లలు యవ్వనానికి వచ్చే సరికి తండ్రికి బాధ్యతలు పెరిగిపోతాయి. కొడుకును బాగా చదివించాలి. కూతుర్ని ఓ మంచి అల్లుడి చేతిలో పెట్టాలనే తాపత్రయం ఉంటుంది.. అందుకే కొన్ని సార్లు ఆయన మనసు మనకు అంత సులువుగా అర్థం కాదు. అంత లోతైనది తండ్రి మనసు. తల్లి ప్రేమను అందిస్తే.. నాన్న బాధ్యతను నేర్పిస్తాడు. చేయి పట్టుకుని దారి చూపుతాడు. దారి తప్పితే మందలిస్తాడు. మారుతున్న కాలంతో పాటు నాన్న అనే పదానికి ఇప్పుడు అర్థాలు మారిపోయాయి. నాన్నంటే మనసులో మాటను పంచుకునే నేస్తమయ్యాడు.
సృష్టిలో అమ్మ ప్రేమ ఎంత అద్భుతమైనదో.. నాన్న ప్రేమ కూడా అంతే మధురం. పిల్లల చేయి పట్టుకుని.. వాళ్లు సెటిల్ అయ్యేవరకూ నాన్న ఆ చేయి వదలడు. జీవితాన్ని ఇస్తాడు.. జీవితంలో ముందుకు నడిపిస్తాడు నాన్న. తను పడే కష్టం పిల్లలు పడకూడదనుకుంటాడు నాన్న.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి