తెలంగాణ రాష్ట్రంలో వంతెనలు, టన్నెళ్లు, పంపుహౌజుల నిర్మాణం తక్కువ వ్యయంలో, తక్కువ సమయంలో పూర్తి చేసే వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు చైనాకు చెందిన నిర్మాణ సంస్థ అన్జు ప్రతినిధులు తెలిపారు. అన్జు ఇన్ఫ్రా టెక్ వైస్ ప్రసిడెంట్ హొస్సేన్ ఖాజీ (hussei khazaei), డైరెక్టర్ యోగేష్ వా, కంట్రీ హెడ్ మనోజ్ గాంధి, పిఆర్వో ఆర్. స్వాతిశ్రీ తదితరులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. గతంలో జరిగిన సమావేశంలో హైదరాబాద్ మూసీ నదిపై బ్రిడ్జి రోడ్డు నిర్మాణానికి, దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి, ప్రాణహిత ప్రాజెక్టు టన్నెళ్లు, పంపు హౌజుల నిర్మాణానికి చైనా కంపెనీలు ముందుకు వచ్చాయి.
వాటి డిజైన్లను చైనా బ్రిడ్జెస్ అండ్ రోడ్స్ కార్పొరేషన్, చైనా కమ్యూనికేషన్స్ అండ్ కన్స్ స్ట్రక్షన్ కంపెనీలు రూపొందించాయి. దుర్గం చెరువుపై నాలుగు లేన్ల రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రికి చూపించారు. మెడిటేషన్ మోడల్, క్యాండిల్ ఫ్లవర్ మోడల్, చెట్టు ఆకుల మోడల్, లోటస్ ఫ్లవర్ ఆకారాలతో డిజైన్లు తయారు చేశారు. 11 అంచెలుగా నిర్మాణం చేపడతామని, 25 నెలల్లో పూర్తి చేస్తామని ప్రతిపాదించారు. మూసీ నదిపై 41 కిలోమీటర్ల పొడవున ఈస్ట్ - వెస్ట్ కారిడార్ నిర్మిస్తామన్నారు. 25 కిలో మీటర్ల మేర స్కైవే, 15 కిలోమీటర్ల మేర రోడ్ వే ఉంటుందన్నారు. ఈ నిర్మాణాన్ని 40 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. వీటి డిజైన్లను కూడా సిఎంకు చూపించారు.
ఈ రెండు ప్రాజెక్టుల్లో దాదాపు 2500 మంది అవసరం అవుతారని, ఎక్కువ మందిని స్థానికులనే తీసుకుంటామని చెప్పారు. ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన టన్నెళ్లు, పంపుహౌజు డిజైన్లు కూడా ఫిబ్రవరి 20 నాటికి అందిస్తామన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు, రహదారులు, వంతెనలు చాలా వేగంగా కట్టాల్సి వుందని, అందుకు సంబంధించిన వ్యూహం తయారు చేసుకోవాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. త్వరలోనే డిజైన్లపై నిర్ణయం తీసుకుని నిర్మాణాలు ప్రారంభించాలని సిఎం నిర్ణయించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి