పెద్ద నోట్ల రద్దు నిర్ణయంవల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మౌన ప్రేక్షక పాత్ర వహించడం సరైంది కాదని, ప్రజలు ఎదుర్కోంటున్న ఇబ్బందులను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు, సోమవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ప్రగతి భవన్ లో ఆదివారం సిఎం సమీక్ష నిర్వహించారు. లక్షలాదిమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని తొలగించేందుకు ఏ చర్యలు తీసుకోవాలనే విషయంపై అధికారులు, మంత్రులు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్తులో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడం కోసం ప్రజలకు అవగాహన కల్పించేలా బ్యాంకర్లతో కలెక్టర్లు మాట్లాడేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వం సహాయకారిగా వుండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వం ఏమి చేయాలనే విషయంపై కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆర్థికశాఖను ఆదేశించారు. సోమవారం క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై కూలంకషంగా చర్చ జరిగేందుకు వీలుగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పడే ప్రభావం తదితర అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి మంత్రులకు అందివ్వాలని ఆర్థికశాఖ కార్యదర్శిని ముఖ్యమంత్రి కోరారు.
అయిదు గురు సభ్యులతో కమిటీ
రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీల నిర్వహణను ప్రోత్సహించేందుకు, ఈ – పేమెంట్స్ వ్యవస్థను పెంపొందించేందుకు అవసరమైన విధానం రూపొందించడానికి అయిదుగురు సభ్యులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. సీనియర్ ఐఎఎస్ అధికారులు సురేష్ చంద్ర, శాంతికుమారి, నవీన్ మిట్టల్, జయేష్ రంజన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘనందన్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్ లు కమిటీలో వున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి