రాష్ట్రంలోని రిజర్వు ఫారెస్టు అంతా పచ్చని చెట్లతో కళకళలాడాలని,ప్రతి ఇంచు అటవీ భూమిని సమర్దవంతంగా కాపాడుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు.
సోమవారం సచివాలయంలో అటవీ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ మిశ్రా, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగరావు, అటవీ శాఖ ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంతో పాటు అన్ని జిల్లాల్లో లక్షలాది ఎకరాల అటవీ భూములున్నాయని, పేరుకు అటవీ భూములు అయినా అందులో అడవి లేదని ముఖ్యమంత్రి అన్నారు. రిజర్వు ఫారెస్టు అన్ని భూముల్లో విరివిగా మొక్కలు పెంచాలని, రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు, అంచనాలు సిద్దం చేయాలని ఆదేశించారు. తెలంగాణకు హరిత హారం కార్యక్రమం కింద నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండలంలో 500 ఎకరాల విస్తీర్ణంలో కోయంబత్తూర్ తరహాలో ఫారెస్టు కాలేజ్ ఏర్పాటు చేయనున్నట్లు సిఎం ప్రకటించారు. దీనికి సంబంధించి అంచనాలు తయారు చేయాలన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో 34 వేల ఎకరాల అటవీ భూమి ఉందని, దాని చుట్టూ కందకం తవ్వి గచ్చకాయల తీగలతో కంచె వేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే మూడేళ్లలో పచ్చదనం ఆచరణలో కనిపించాలని చెప్పారు. పండ్లు, పూల చెట్లతో పాటు ఔషధ మొక్కల పెంపకానికి ప్రాధాన్యతనివ్వాలని, గ్రామాల్లో దోమలు రాకుండా కూడా ఔషధ మొక్కలు ఉపయోగపడతాయని సిఎం చెప్పారు. హైదరాబాద్ నగరంలోని గుర్రం గూడెం, దూలపల్లి, ఎస్‌ఆర్ నాయక్ నగర్, కొండ్ల కోయ, నాగారం, హరిణి వనస్థలి తదితర ప్రాంతాల్లో ఫారెస్టు బ్లాకులు ఉన్నాయని, వాటిని రక్షించాలన్నారు. వాటి చుట్టూ కేబిఆర్ పార్కు మాదిరిగా వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి