రాష్ట్రంలో కొత్తగా 84 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి వున్నందున శాఖల వారీగా కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ శ్రీ ఘంటా చక్రపాణి నేతృత్వంలోని అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కనీసం వారానికోసారి సమావేశమయి ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లోను, గురుకుల విద్యా సంస్థల్లోను వేలాది మంది ఉపాధ్యాయుల నియామకం జరపాల్సి వున్నందున దానికి సంబంధించి వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని డిప్యూటి సీఎం శ్రీ కడియం శ్రీహరిని ముఖ్యమంత్రి ఆదేశించారు. పంద్రాగష్టు వేడుకల్లో ముఖ్యమంత్రి ఉద్యోగ నియామకాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆ మరునాడే బుధవారం నాడు డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ తదితరులతో సీఎం మాట్లాడారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఖాళీలను భర్తీ చేయడం, కొత్త ఉద్యోగాల నియామకం ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏ పని చేపట్టినా వాటిని అడ్డుకోవడానికి కొన్ని ప్రతీప శక్తులు కాచుకుని కూచున్నాయని, ఉద్యోగ నియామక ప్రక్రియను కూడా కోర్టు కేసుల ద్వారా అడ్డుకుంటున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా వుండాలని, న్యాయపరమైన చిక్కులకు అవకాశం లేకుండా నోటిఫికేషన్లు జారీ చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని సీఎం సూచించారు. నోటిఫికేషన్లకు ముందే న్యాయ శాఖ అధికారులతో చర్చించాలని సూచించారు. ఎవరైనా కోర్టులో కేసులు వేస్తే కూడా వాటిని సమర్ధంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా వుండాలని సీఎం చెప్పారు. అధికారులంతా పూర్తి సమన్వయంతో పనిచేయాలని కోరారు. శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియను వేగంగా చేపట్టడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటు చేశామని, దీనిద్వారా ఇప్పటికే 58 నోటిఫికేషన్లు జారీ చేసి నియామక ప్రక్రియను ముందుకు తీసుకుపోతున్నట్లు టిఎస్ పిఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ముఖ్యమంత్రికి వివరించారు. టిఎస్ పిఎస్సి ద్వారా ఇప్పటికే 5000 మందికి పైగా నియామకం అయ్యారని, మరో నెల రోజుల వ్యవధిలో 12 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముగుస్తుందని సీఎంకు చెప్పారు. న్యాయపరమైన వివాదాలు కూడా కొలిక్కి వచ్చినందున త్వరలోనే గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి భవిష్యత్తులో 84 వేలకు పెగా ఉద్యోగాలను భర్తీ చేయాల్సి వున్నందున పబ్లిక్ సర్వీసు కమిషన్ గురుతర బాధ్యత పోషించాలని సీఎం కోరారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ కు పని భారం పెరిగినందున అందులో కొత్తగా 90 మంది ఉద్యోగులను నియమించడానికి కూడా సీఎం అంగీకరించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు, పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి వాణీ ప్రసాద్, జీఎడి ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హ తదితరులు సమావేశమయ్యారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియకు అవలంభించాల్సిన వ్యూహంపై చర్చించారు. శాఖల వారీగా ఉద్యోగాల భర్తీకి వెంటవెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది ఏర్పడే ఖాళీల వివరాలను కూడా ముందుగానే తీసుకుని నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా లక్షా 12 వేలకు పైగా ఉద్యోగాల నియామకాల లక్ష్యాన్ని అధిగమించేందుకు నిరంతరం కృషి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్లపై కొందరు కోర్టుకు వెళ్లినందున ఆ కేసులకు సంబంధించి కూడా న్యాయస్థానంలో సమర్దవంతంగా వాదనలు వినిపించాలని నిర్ణయించారు. నియామకాలను వివాదస్పదం చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వుండి తెలంగాణ యువతకు న్యాయం చేయడం లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి