నంద్యాల ఉప ఎన్నికలో విజయం ఎవరిని వరించబోతుంది?? విశ్లేషణ.. 2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెదెపా గెలిచిన తరువాత పలు సందర్భాలలో ఉపఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరగవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ ఏదో ఒక సాకుతో ఎన్నికలు వాయిదా వేస్తూ తెప్పదాటుకుంటూ వచ్చిన చంద్రబాబుకి వై.సీ.పీ లో గెలిచి తెదెపా వైపు ఫిరాయించిన భూమా నాగిరెడ్డి మరణంతో అనివార్య పరిస్థితిలో ఉప ఎన్నిక జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడిన మూడున్నర సంవత్సరాలకు జరుగుతున్న తొట్టతొలి ప్రత్యక్ష ఎన్నిక కావటంతో రాష్ట్రప్రజలందరి దృష్టీ ఈ ఎన్నికల మీద పడింది. ఇంకో 48గంటల్లో జరగనున్న ఈ ఎన్నికలో ఎవరి బలాబలాలేంటో ఒక చిన్న విశ్లేషణ చేద్దాం.. నేను నంద్యాల వెళ్లలేదు. చరిత్ర, రికార్డ్స్, జరుగుతున్న పరిణామాల ఆధారంగా ఊహాజనితంగా నా ఆలోచనా శైలిలో ఇస్తున్న ఒక చిన్న విశ్లేషణ మాత్రమే.. ఎన్నిక అనగానే మొదట అభ్యర్ధిని, ఆ తరువాత అతను ఉన్న పార్టీని చూడటం ఆనవాయితీ.. నంద్యాల రాజకీయాన్ని తెలుగుదేశం స్థాపించబడిన తర్వాతి 33 సంవత్సరాల చరిత్ర ఆధారంగా విశ్లేషిద్దాం.. భూమా బ్రహ్మానంద రెడ్డి, భూమా నాగిరెడ్డి అన్న కొడుకుగా నంద్యాల ఉప ఎన్నికల ప్రకటన సమయంలో మాత...